ఇది అత్యాశ కాదు కదా ! - కుప్పిలి పద్మ

If there is a problem with the display of the content below, you might need to download a Telugu font on your computer.

 

శుభ్రమైన రోడ్ కి వొక వంక అందమైన గోదావరి. మరో వంక పచ్చిక నిండిన ఖాళీ స్థలం. మబ్బు పట్టిన ఆకాశం.

 

చల్లని గాలి. ఆ ఖాళీ స్థలంలో వరుసగా కూల్ డ్రింక్స్ , బిస్క్ ట్స్ యిలా తినుబండరాలు అమ్మే కొట్లు.1 పదహారు పదిహేడేళ్ళ వయసున్న ఆడపిల్లల్లిద్దరు వో కొట్లో వున్న స్త్రీ ని బాత్రూం వుందా అర్జంట్ అని అడుగుతున్నారు. అక్కడికి కొంచెం దూరంలో బాత్రూంస్ వున్న బోర్డ్ చూసానని చెప్పాను. అవి లాక్ చేసి వుంటాయని ఆమె చెప్పారు. అదేమిటంటే పుష్కరాలప్పుడు కట్టారు. తరువాత నుంచి అవెప్పుడూ తాళం వేసే వుంటాయని చెప్పారు. అదొక టూరిస్ట్ ప్లేస్. ఆ రోజు ఆదివారం. టూరిస్ట్ లు బాగానే వున్నారు.

 

అవును యీ దేశం లో చిన్న వూరైనా, పట్టణమైనా, నగరమైన, పర్యాయటక ప్రాంతమైన మనమంతా యెదుర్కొనే అతి పెద్ద సమస్య పబ్లిక్ టాయిలెట్స్. వార్తలో మైదానం కాలమ్ లో యీ పబ్లిక్ టా యిలేట్స్ గురించి అప్పుడెప్పుడో రాసాను. అప్పుడు 'అవును యివి కావాలి. యిదెంత పెద్ద సమస్యో' అని వారి వారి అభిప్రాయాలని, అనుభవాలని చాలా మంది పంచుకొన్నారు. అసలు యీ సమస్యని పైకి చెప్పుకోడానికి యెంతగానో యిబ్భంది పడతారు. సిగ్గుపడతారు. యిది వొక నిషిద్ధ పదం.

 

చాలా సంవత్సరాల క్రితం 'పల్లకి'లో కంఠంనేని రాధాకృష్ణ మూర్తి గారు యిదే అంశం మీద వొక కథ రాసారు. ఆ కథ వొక పిక్చర్ మెమోరీ లా నా మెదడుకి హత్తుకుపోయింది. తిరిగి అదే సమస్య పై యిప్పుడు రాస్తున్నప్పుడు అసలు యిన్నేళ్ళలో యీ విషయంలో యెమైనా మార్పులు వచ్చాయా అని ఆలోచిస్తుంటే చాలా విషయాలు మెదిలాయి కళ్ళముందు.

 

నగరం చాలా విస్తరించింది. ఆధునిక హంగులు వున్నాయి. అత్యాధునిక వసతులున్నాయి.

 

అందులో భాగంగానో లేదా సిటీని ప్లాన్ చేస్తున్నవాళ్ళ ఆలోచనలో భాగంగానో చాలా చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ స్త్రీలకి, పురుషులకి వచ్చాయి. అయినా యిదింకా మాటాడాల్సిన సమస్య గానే వుంది. యెందుకంటే ఆ వున్నవి సరిపడా లేవు. నగరంలో చాల చోట్లా లేవు. అసలు యీ నగరాన్ని మరింత విస్తరిస్తున్నప్పుడు లేదా వున్న నగరాన్ని మరింత మెరుగు పరుస్తున్నప్పుడు యీ విషయాలని ప్లానింగ్ లో చేరుస్తున్నారా లేదా... అసలు యీ విషయాన్ని సిటీని ప్లాన్ చేసేవారు ఆలోచిస్తారా లేదా అన్నది తెలీదు. యిక ఆఫీసుల్లో టాయిలెట్స్ ని యేర్పర్చిన స్థలం స్త్రీలకి సౌకర్యంగా వుండదు. యిక కొన్నిపాత షాపింగ్ మాల్స్ లో అక్కడ పనిచేసే వారికి టాయిలెట్స్ వుండవ్. ఆ ప్రాంగణంలో యేదైనా రెస్టారెంట్ వుంటే వాళ్ళతో మాటాడుకొని వాటిని వాడుకొంటారు. అలానే కొన్ని అపార్ట్ మెంట్స్ లో అక్కడ యిళ్ళల్లో పనికి వచ్చే స్త్రీలకి టాయిలెట్స్ వుండవు. వాళ్ళల్లో కొంత మంది లోకల్ రైల్లో ప్రయాణించి పనులకి వెళతారు. స్టేషన్ లోని టాయిలెట్స్ ని వాడుకొంటారు.

 

వున్న వాటితో యెదుర్కొంటున్న కొన్ని సమస్యలు యేమిటంటే , కొన్ని టాయిలెట్స్ కి తాళాలు వేసి వుంటాయి. కొన్నింట్లో అడుగు కూడా పెట్టలేం. కొన్నింట్లో నీళ్ళు వుండవ్. కొన్ని చీకటి కొట్టాల్లా వుంటాయి. సరియైన డస్ట్ బిన్స్ వుండవ్. మల్టీ ఫ్లెక్స్ ల్లో, మాల్స్ లో టాయిలెట్స్ లో పనిచేసే స్త్రీలు వాటిని వాడే స్త్రీలకి ఫ్లష్ చెయ్యండి అని చెప్పటం వింటున్నప్పుడు అంత భాధ్యతారహితం గా యెలా ప్రవర్తిస్తారు అనిపిస్తుంది. అలానే కొంతమంది స్త్రీలు నేప్ కిన్స్ ని పడేస్తారు. నిరంతరం అక్కడ వున్నస్త్రీలు శుభ్రం చేస్తూనే వుంటారు. అక్కడ గచ్చు డ్రై గా వుండెట్టు చూస్తుంటారు. మీరు బాత్రూమ్స్ ని శుభ్రంగా వాడండి అని చెప్పించుకొనే స్త్రీలు వొక్క సారైనా అవి పబ్లిక్ వాడేవి భాద్యత గా వుండాలని అనిపించదా ?! మరి యిలాంటి విషయాలని కూడా పదేపదే చెప్పాలా ? బాత్రూమ్స్ వాడిన తరువాత ఫ్లెష్ చెయ్యండి అనే బోర్డుస్ ని మనం చాల ఆఫీస్ ల్లో , హాస్పిటల్స్ లో చూస్తుంటాం. కొన్ని రెస్టారెంట్స్ లో అత్యంత భయంకరంగా కంపు కొడుతుంటాయి. వాటిని నిరంతరం శుభ్ర పరిచే స్టాఫ్ వుండరక్కడ.

 

నగరం చుట్టు పక్కల వూరు ల్లో వారికి జీవనాధారం. ప్రతి రోజు అనేక పనుల మీద వచ్చే వారెందరో.

 

కొంతమంది రోజంతా పనులు చేసుకొని సాయంత్రం యింటికి వెళతారు. హాస్పిటల్స్ కి వచ్చే వారు యెందరో. యింత మంది ప్రజలకి చాల ముఖ్యమైన టాయిలెట్స్ వుండాల్సినన్ని లేవు. వున్నవి సరిగ్గా లేవు. నగరంలో అనేక గోడలని టాయిలెట్స్ గా వాడుకోనే పురుషులు రైతు బజారు గోడలని వ దలటం లేదు. ఆ దుర్గంధం మధ్యనే తాజా కాయగూరలు కోనుకొనే వారు అమ్మే వారు ముక్కులు మూసుకొంటూ యే ఆరోగ్యాన్ని ఆశించాలో!!!

 

నగరాల ఆధునీకరణలో అతి ముఖ్యమైన యీ టాయిలెట్స్ కి ప్రాధాన్యత నివ్వాలని ఆశించటం పెద్ద ఆశగానే కనిపించ వచ్చేమో కాని కావాలనుకోవటం అత్యాశ కాదుగా. అలానే వున్న టాయిలెట్స్ ని వాడే వారి నుంచి శుభ్రమైన ప్రవర్తనని ఆశించటమూ అత్యాశ కాదనే అనుకుంటున్నాను.

Nov 24, 2015

X